
ప్రచారం చేస్తున్నారంటూ కొట్టుకున్న పోలింగ్ ఏజెంట్లు… పరిగిలో ఉద్రిక్తత..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ పార్టీకి చెందినవారు దాడికి పాల్పడ్డారు.
తమకు ఓట్లు వేయాలంటూ కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తుండటంతో బీఆర్‌ఎస్ ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో నలుగురు గాయపడ్డారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తున్నాడని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్తి సహా పలువురు గాయపడ్డారు.


