
పాలేరు ఏకగ్రీవానికి కృషి చేసిన నేత ఇకలేరు
రోడ్డు ప్రమాదంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యడవల్లి రామిరెడ్డి మృతి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలేరు గ్రామం ఏకగ్రీవం కావడానికి కీలకంగా కృషి చేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి రామిరెడ్డి (55) ఇక లేరు. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన ఆయన బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
నాయకన్‌గూడెం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద వార్తతో పాలేరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి
రామిరెడ్డి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “నేను ఒక మంచి నాయకుడిని మాత్రమే కాదు… నాకు ఎంతో ఆత్మీయుడిని కోల్పోయాను. కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు కూడా ఈ మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం అహర్నిశల కృషి
కూసుమంచి మండలంలో రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా పనిచేశారని మంత్రి గుర్తు చేశారు.
ముఖ్యంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలేరు గ్రామం ఏకగ్రీవం కావడానికి ఆయన కృషి చేశారని, అలాగే పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర పోషించారని తెలిపారు.
రామిరెడ్డి మృతితో పాలేరు గ్రామం ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు.


