
గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను చితకబాదిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు
అపస్మారక స్థితిలో 9వ తరగతి విద్యార్థి దీపక్
హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు
మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఘర్షణ సమయంలో అందుబాటులో లేని వార్డెన్, అధ్యాపకులు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయం అర్ధరాత్రి రణరంగంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఇంటర్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులపై దాడి చేశారు. దీపక్ అనే తొమ్మిదో తరగతి చెందిన విద్యార్థికి గాయాలైనట్లు తెలుస్తోంది.
మరొకరిని కిందపడేసి విచక్షణారహితంగా కాళ్ళతో తన్నడంతో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఎట్టకేలకు తోటి విద్యార్థులే బాధితుల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంత గొడవ జరుగుతున్నా విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
రాత్రి విధుల్లో ఎవరూ లేరా..!
గురువారం అర్థ రాత్రి నర్సంపేట పట్టణంలోని గిరిజన గురుకుల విద్యాలయంలో సీనియర్ విద్యార్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గొడవ సద్దుమణిగేలా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
వాస్తవానికి రెగ్యులర్ గా రాత్రి విధుల్లో ఉపాధ్యాయులు సహా సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సి ఉంది. రోజుకు ఒకరు చొప్పున పాఠశాలకు ఒకరు, ఇంటర్ కు ఒకరు మొత్తం ఇద్దరు తప్పనిసరిగా నైట్ స్టే ఉండాల్సి ఉంది.
కానీ ఒక్కరు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ విద్యార్థులకు అడ్డు చెప్పే వారు లేకపోవడంతో ఘర్షణ పెద్దది అయినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల విద్యాలయం బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేసి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



