
ఖమ్మం జిల్లాలో నగర వాసుల ఆందోళన…
ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్ కాలనీలో స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక కార్పొరేటర్ తన వెంచర్లో ప్లాట్లు అమ్ముకునేందుకు పక్కనే ఉన్న శ్మశానవాటికను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఆందోళనకారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ కాల్వ కట్టకు అనుకుని ఉన్న మంచికంటి నగర్ లో 30 ఏండ్లుగా పేద ప్రజలు నివసిస్తున్నారు. కాల్వ కట్టకు అనుకుని శివారున ఉన్న కొంత ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకున్నారు.
ఆ స్థలం పక్కనే అదే డివిజన్ కు చెందిన కార్పొరేటర్ ప్రైవేట్ వెంచర్ కలిగి ఉన్నాడు. శ్మశాన వాటిక పక్కనే వెంచర్ ఉండటంతో ప్లాట్లకు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో కార్పొరేటర్ ఇంటి స్థలం లేని కొందరు పేదలతో శ్మశాన వాటికలో గుడిసెలు గుడిసెలు వేసుకునేలా చూశాడు. ఇప్పుడు అక్కడ పక్క ఇండ్లు నిర్మించుకునే ప్రయత్నాన్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు.
ఇటీవల ప్రభుత్వ అధికారులు శ్మశాన వాటికలో వేసుకున్న గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు.
శ్మశాన వాటికలో గుడిసెలు వేసుకున్న వారు మాత్రం అధికారులు తమకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలం ఇస్తే ఇక్కడి నుంచి ఖాళీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా, శ్మశాన వాటికపై గుడిసెలు వేసిన చోటును ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సీఐ భాను ప్రకాశ్ సందర్శించారు.



