
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Web desc : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కాగజ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగపూర్ కు వెళ్లారు.
విధి వక్రీకరించి మృత్యువు కారు రూపంలో వచ్చి నలుగురు మహిళలను బలితీసుకుంది. బుధవారం అర్ధరాత్రి మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఈ ఘోర ప్రమాదం కాగజ్‌నగర్ పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైద్యం నిమిత్తం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లారు. పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన క్రమంలో దేవాడ సమీపంలోని బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది.
అదుపుతప్పిన కారు బ్రిడ్జి పై నుండి కిందకు పడిపోవడంతో లోపల ఉన్నవారు సల్మా బేగం, శబ్రీమ్, ఆఫ్జా బేగం, సహార, తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు అందరూ మహిళలే కావడం గమనార్హం.
ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం :
ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వారిని వెంటనే చంద్రపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఒక్కసారిగా నలుగురు కుటుంబ సభ్యులు మరణించడంతో నిజాముద్దీన్ కాలనీలో రోదనలు మిన్నంటాయి. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే జాకీర్ కుటుంబంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది.



