
కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత…
Web desc : బూర్గంపాడు మండల రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి(62) ఇకలేరు.
గురువారం రాత్రి విశాఖపట్నంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.
ఆయన మరణ వార్త వినగానే సారపాకతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. రోసిరెడ్డి వ్యక్తిగత పనిపై వైజాగ్ వెళ్లారు.
అక్కడ గురువారం రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంట ఉన్న వారు తక్షణమే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వైఎస్సార్ వీరాభిమానిగా.. నిబద్ధత గల నాయకుడిగా..
రోసిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు వీరాభిమాని. రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఎంతో నిబద్ధతతో కూడుకున్నది.
రోసిరెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పనిచేసి, స్వామివారి సేవలో తన వంతు పాత్ర పోషించారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే మనస్తత్వం ఆయనది. పార్టీలకతీతంగా అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు.
రోసిరెడ్డి మరణ వార్త తెలియగానే బంధువులు, స్నేహితులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఒక మంచి నాయకుడిని,ఆపదలో ఆదుకునే మిత్రుడిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని విశాఖపట్నం నుండి సారపాకలోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు.
ప్రజల మనిషిగా, నిగర్విగా పేరు తెచ్చుకున్న రోసిరెడ్డి మరణం బూర్గంపాడు మండల రాజకీయాల్లో తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.



