
తండ్రి మందలించాడని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!
తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన దోమల్ గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆదివారం ( డిసెంబర్ 28) న బండ మైసమ్మ నగర్ కు చెందిన 15ఏళ్ల కొల్లా అరవింద్ తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
హైదరాబాద్‌లోని దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాపుర ఉంటున్న రాకేష్ ,లత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన కొల్లా అరవింద్ (15) గాంధీ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టైం వేస్ట్ చేయకుండా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి కుమారుడిని మందలించాడు.
దీంతో మనస్థాపానికి గురైన పదో తరగతి విద్యార్థి అరవింద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు అరవింద్‌ను కిందకు దించి.. పరుగు పరుగున గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది



