
రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి
టాటానగర్ (టాటా) నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 నంబరు టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1:30 గంటల సమయంలో భయానక అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.
ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు పొగను గమనించి, తక్షణమే రైలును స్టేషన్లో ఆపేశారు. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు మంటలు రెండు బోగీలకు పూర్తిగా వ్యాపించి, అవి పూర్తిగా దగ్ధమయ్యాయి.
దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై, తమ బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనలో B1 బోగీలో ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70) గా గుర్తించారు.
ప్రమాదం కారణంగా ఎలమంచిలి రైల్వేస్టేషన్లో పొగ దట్టంగా అలుముకుంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.
మరోవైపు, రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్కు 3 ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. రైల్వే భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి.. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు.
బాధితుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అనిత అన్నారు.
గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సంబంధిత అధికారులకు సూచించారు.



