
డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం
బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం
అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు
-టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
సికె న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు.ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదని, అబద్దాలు, కల్పితాలతో వాళ్ళు చేస్తున్న అపోహలు నమ్మవద్దని ఆయన జర్నలిస్టులను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు ఎంతవరకు పని చేశాయో, దానికి కారణం ఎవరన్నది ప్రతి జర్నలిస్ట్ కు తెలుసునన్నారు. జర్నలిస్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలే నేడు జర్నలిస్టులకు మేలు జరుగుతోందంటే ఓర్చుకోలేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ఏ సంస్థలకైనా, ఏ సంఘాల కైనా టియుడబ్ల్యూజే మద్దతు ఉంటుందని, అయితే ఆ పోరాటం సహేతుకమైనది అయి ఉండాలన్నారు. 252 జీవో తో 13వేల అక్రిడేషన్ కార్డులు తగ్గుతున్నట్లు ఆందోళన చేస్తున్న సంఘానికి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందేలా చేయడమే టియుడబ్ల్యూజే ప్రధాన ధ్యేయం అన్నారు. 1996 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 వేల అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉండేవని, అప్పటి తమ సంఘం ప్రభుత్వంతో కొట్లాడి గ్రామీణ విలేకరులందరికీ మండలాల వారీగా అక్రెడిటేషన్లు ఇప్పించిన చరిత్ర తమకు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3వేల అక్రెడిటేషన్ లను 12వేలకు పెంచిన ఘనత తమ సంఘానిదేనన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23 వేల అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని గొప్పలు చెబుకుంటున్న మిత్రులు , పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే సంఖ్యలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. కార్డుల సంఖ్య ముఖ్యం కాదని, ఆ కార్డులతో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసారో, వాటి కోసం ఎన్ని ఉద్యమాలు చేసారో చెబితే బాగుంటుందన్నారు. 252 జీవో తెచ్చి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం సరైంది కాదన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు ప్రముఖులైన పాత్రికేయులతో కమిటీ ఏర్పాటై, ఐదారుసార్లు సమావేశమై మార్గదర్శకాలు రూపొందించిన విషయం గగ్గోలు చేస్తున్న మిత్రులకు తెలియదా? అని విరాహత్ ప్రశ్నించారు. సమాచార శాఖ కమిషనర్ తో పాటు ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్, ది హిందూ పత్రిక పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి, వి6 వెలుగు పత్రిక సీఈవో అంకం రవి, సియాసత్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నాయకుడు కె.ఎన్.హరి తదితరులతో వేసిన కమిటీ రూపొందించిన నిబంధనల మేరకే 252 జీవో వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల నియమ నిబంధనలు రూపొందించేందుకు సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచించిన సిఫార్సులను అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రామచంద్ర మూర్తి కమిటీ సిఫార్సులకు భిన్నంగా తీసుకువచ్చిన 239 జీవో తో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే అప్పటి మీడియా అకాడమీ చైర్మన్, ఆయన సంఘం ఎందుకు నోరెత్తలేదన్నారు. ఆ జీవోతో చిన్న మధ్య తరహా పత్రికలకు, ఉర్దూ పత్రికలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దాదాపు 4500అక్రెడిటేషన్ కార్డులు తొగించబడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన యాజమాన్యాలు స్థాపించిన రెండు ప్రధాన పత్రికలకు అక్రెడిటేషన్లను అడ్డుకున్నది ప్రస్తుతం ఆందోళన చేస్తున్న సంఘమేనని విరాహత్ ఆరోపించారు. ఆ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ను ఆశ్రయించి, ఆ పత్రికలకు న్యాయం చేసిన ఘనత తమ సంఘనిదే అని ఆయన గుర్తుచేసారు. అయితే గతంలో రాష్ట్రంలో జారీచేసిన దాదాపు 3 వేల అక్రెడిటేషన్ కార్డులు జర్నలిజం వృత్తితో సంబంధం లేని వారి చేతుల్లో ఉన్నట్లు తమ సంఘానికి అందిన ఫిర్యాదుల్లో తేలిందన్నారు. అడ్డదారుల్లో అక్రెడిటేషన్లు పొందిన వారే జర్నలిస్టులుగా చలామణి అవుతూ, ఇసుక వ్యాపారులను, రైస్ మిల్లర్లను, బిల్డర్లను, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ పోలీసులకు చిక్కారని, వారిపై కేసులు నమోదు కావడం జర్నలిజం విలువలను మంటగలిపిందన్నారు. జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనకు దిగిన ఆ సంఘం రాష్ట్ర కీలక నాయకుని కుటుంబ సభ్యులు నలుగురు మీడియా ఏజెన్సీ పేరుతో అక్రిడేషన్ కార్డులు పొందారని, అదే సంఘానికి చెందిన మరో రాష్ట్ర నాయకుని కుమారుడు యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఓ గ్రామ సర్పంచ్ గా వ్యవహరిస్తున్నప్పటికీ, అతనికి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు ఇవ్వడంపై తమ సంఘం ఆందోళన చేసి ఆ కార్డును రద్దు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పనిచేసే బాయ్ కి కూడా ఓ పత్రికా బ్యూరో కార్డు అందించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి పద్దతుల్లో అక్రెడిటేషన్ కార్డులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, వాటికీ గౌరవం దక్కించే ఉద్దేశంతోనే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో 252 జీవో ను తెచ్చారని ఆయన పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డులతో రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు ఇంతకాలం ఏలాంటి ప్రయోజనం చేకూరలేదని, కనీసం ఇప్పుడైనా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి, అక్రెడిటేషన్, మీడియా కార్డులు పొందే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రయోజనాలు చేకూర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 252 జిఓ లో ఉన్న కొన్ని లోటు పాట్లను తాము గుర్తించామని, వాటిని సవరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఏది ఏమైనా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులు అందించేందుకు తమ సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ ఇటీవల తమ సంఘం సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు రెండు వేల మంది జర్నలిస్టులతో నిర్వహించిన మహా ధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి యుద్ధప్రాతిపదికన జీవో జారీ చేసిందన్నారు. అయితే ఆస్తిత్వం కోసం, ఉనికిని చాటుకోవడానికి ఒక సంఘం తమ సంఘ జాతీయ నాయకుడిపై దుష్ప్రచారం చేస్తూ అలజడి సృష్టించడం సహించరానిదన్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు అందిన సంక్షేమ పథకాలన్నీ తమ సంఘం పోరాట ఫలితమేనన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, కార్యదర్శులు కె. శ్రీకాంత్ రెడ్డి, వరకాల యాదగిరి, జి. మధు గౌడ్, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు



