
ఏదులాపురం ప్రగతికి.. పొంగులేటి ‘శంకు’రవం
రాష్ట్రానికే ఈ మున్సిపాలిటీని మేలుబంతిగా తీర్చిదిద్దుతాం
రూ. 61 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీకారం
56 మందికి డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ
సికె న్యూస్ ప్రతినిధి
ఏదులాపురం : ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన (రోల్ మోడల్) పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన ఏదులాపురంలో పర్యటించి సుమారు రూ. 61 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు.
మౌలిక వసతులే లక్ష్యం
మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం చెరువు నాలాపై రూ. 20.25 లక్షలు, సాయి గణేష్ నగర్ ఎన్‌ఎస్‌పీ కాల్వపై రూ. 15.70 లక్షలతో నిర్మించనున్న కల్వర్టు పనులకు మంత్రి భూమిపూజ చేశారు.
అనంతరం పోలేపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో రూ. 25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రతి వీధినీ సీమెంటు రోడ్డుగా మారుస్తామని, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
అర్హులైన పేదలకు ‘ఇందిరమ్మ’ గూడు
ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
“ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ప్రతి సోమవారం లబ్ధిదారులు కట్టుకున్న ఇంటి దశను బట్టి నేరుగా నిధులు జమ చేస్తున్నాం” అని వివరించారు.
రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా వంటి హామీలను అమలు చేశామని గుర్తుచేశారు. అనంతరం పోలేపల్లి డబుల్ బెడ్ రూంల లబ్ధిదారులు 56 మందికి మంత్రి ఇళ్ల పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో నర్సింహారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు తదితరులు పాల్గొన్నారు.



