
కటౌట్లు చూసి టికెట్లు ఇవ్వం.. గెలిచే ‘గుర్రాల’కే బి-ఫామ్ : మంత్రి పొంగులేటి
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీ నేతలతో సన్నాహక సమావేశం
32 వార్డుల్లోనూ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కదలాలి
అభివృద్ధి మన బ్రాండ్.. ప్రచారమే మన ఆయుధం
వార్డుల వారీగా సమస్యల గుర్తింపు.. నిధుల మంజూరుకు మంత్రి హామీ
ck news
ఖమ్మం : రాబోయే మున్సిపల్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యం
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మంత్రి కీలక ప్రకటన చేశారు. “కటౌట్లు పెట్టినంత మాత్రాన టికెట్లు రావు.
ఎవరు ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతారో, ఎవరికి క్షేత్రస్థాయిలో ప్రజల ఆశీస్సులు ఉంటాయో వారికే బి-ఫాం అందుతుంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
నా సొంత రక్తసంబంధీకులైనా సరే.. ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ వస్తుంది” అని స్పష్టం చేశారు. ఏదులాపురంలోని 32 వార్డుల్లోనూ విజయం సాధించడమే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధిని ఇంటింటికీ చేరవేయండి
ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని మంత్రి సూచించారు.
“ఏదులాపురం పరిధిలో ఒక్క ఉపాధి హామీ పథకంతోనే రూ. 100 కోట్ల నిధులు తెచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేశాయి.
ఈ అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగత ప్రచారం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. చేసిన పనిని చెప్పుకోవడంలో మనం వెనకబడకూడదు” అని పేర్కొన్నారు.
వార్డుల వారిగా ప్రణాళిక
ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న సమస్యలను (రోడ్ గ్యాప్‌లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లు) గుర్తించి వెంటనే అధికారులకు జాబితా ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ఆ పనులన్నీ పూర్తి చేసేలా నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. “ఇళ్ల స్థలాల విషయంలో పేదలకు అన్యాయం జరగకుండా నాయకులు పర్యవేక్షించాలి.
ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి, చావా శివరామకృష్ణ, బేబీ స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, హరినాథ బాబు తదితరులు పాల్గొన్నారు.



