
దారి తప్పిన వయోవృద్ధుడికి ఆపద్బాంధవుడిగా మారిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్
విధి నిర్వహణలో మానవత్వం…
75 ఏళ్ల వయోవృద్ధుడికి అప్పనహస్తం తక్షణ స్పందనతో ప్రాణాలు కాపాడిన జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి
సికె న్యూస్ ప్రతినిధి
వైరా | ఖమ్మం జిల్లా
విధి నిర్వహణలో ఉన్నా మానవత్వాన్ని మరువని వ్యక్తిగా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
వైరా అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో దారి తప్పి రెండు మూడు రోజులుగా తిరుగుతున్న సుమారు 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధుడిని గమనించి, అతడికి తక్షణ వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
టీ కొట్టు మహిళ సమాచారం… వెంటనే స్పందన
వైరా వెళ్తున్న సమయంలో అక్కడి కిరాణా షాపు నిర్వాహకులు దారి తప్పి తిరుగుతున్న వయోవృద్ధుడి పరిస్థితిని డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.
సమాచారం అందగానే ఆలస్యం చేయకుండా వయోవృద్ధుడి వద్దకు స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ వయోవృద్ధుడు కనీసం మాట్లాడలేని స్థితిలో, తీవ్ర నీరసంతో ఉన్నట్లు గమనించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్, పరిస్థితి విషమంగా ఉందని అర్థం చేసుకుని వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
108 సిబ్బంది అనూహ్య స్పందన
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతి వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చేలోపు, అలాగే అంబులెన్స్‌లో కూడా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించడం విశేషం.గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలింపు వయోవృద్ధుడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ గౌడ్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ కి ఫోన్ ద్వారా పూర్తి ఆరోగ్య వివరాలు తెలియజేశారు.
సూపరింటెండెంట్ అలర్ట్… మెరుగైన వైద్యం
డాక్టర్ నరేందర్ గారు వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేశారు. వారి టీమ్ డాక్టర్లతో సమన్వయం చేసుకుని వయోవృద్ధుడికి తక్షణం మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పోలీస్ శాఖకు సమాచారం… వివరాల సేకరణ
వయోవృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయాలపై తెలుసుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్‌కు సమాచారం ఇచ్చి, ఆస్పత్రి సిబ్బందితో కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.
ప్రజల ప్రశంసలు
గతంలో కూడా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాని , ఆయా సందర్భాల్లో అనారోగ్య కారణాలవల్ల ఇబ్బంది పడుతున్న వారికి గాని , తన వంతుగా సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించేవారు…
ఇలా విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ చర్యపై ప్రజలు, వైద్య వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. “ఇలాంటి అధికారులే సమాజానికి ఆదర్శం” అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



