
రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి…
రంగారెడ్డి జిల్లా మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
గురువారం ( జనవరి 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఈ షాకింగ్ సంఘటన మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద చోటు చేసుకుంది.
మీర్జాగూడ గేట్ వద్ద అర్ధరాత్రి దాటాక శంకర్పల్లి మండలం దొంతానపల్లిలోని ICFAI (IBS) కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సూర్యతేజ (20), సుమిత్ (20), శ్రీనిఖిల్ (20), రోహిత్ (18) గా గుర్తించారు.
కారులో ఉన్న మరో విద్యార్థిని నక్షత్ర (20) తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మోకిల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన పిల్లలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో, కళాశాలలో తీవ్ర విషాదం అలుముకుంది.



