
దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
కేటీఆర్ కు దమ్ముంటే ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచించారు. కెటిఆర్‌కు దమ్ముంటే ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. జిల్లా పర్యటనలో వచ్చి గొప్పలు మాట్లాడటం కాదని దమ్ముంటే తన చాలెంజ్ స్వీకరించాలన్నారు.
గురువారం మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ కెటిఆర్ ఖమ్మం టూర్‌లో భాగంగా బుధవారం ఆయన చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరినో గెలిపించడం కాదు,
కెటిఆర్ ఇక్కడకు వచ్చి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతావో దిగాలని కెటిఆర్ ముక్కు నేలకు రాసినా ఉమ్మడి ఖమ్మంలో గెలవడం మీ నాయన తరం కాదని, ఇక నీ వల్ల ఏమవుతుందని మంత్రి పొంగులేటి విమర్శించారు. కెటిఆర్ ముందు తన ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి పొంగులేటి హితవు పలికారు.
ఆరు నెలలకే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో చూపిస్తామన్నారు.
కెటిఆర్ మతి భ్రమించి రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యుడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందన్న విషయాన్ని కెటిఆర్ మర్చిపోతున్నారన్నారు.
అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‌గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించి మాట్లాడేదని ఆయన మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు,
కానీ, ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు వరు సగా దెబ్బకొట్టినా బుద్ది తెచ్చుకోకుండా అవాక్కులు, చేవాకులు పేలుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఎన్నికలైతే మీరు రెఫరెండం అని చెప్పారో ఆ ఎన్నికల్లోనే మీకు ప్రజలు గూబగుయ్యిమనిపించారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమీ ఫైనల్ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.



