BhadrachalamPoliticalTelangana

ఉద్యోగాల పేరుతో లక్షల్లో మోసం..

ఉద్యోగాల పేరుతో లక్షల్లో మోసం..

ఉద్యోగాల పేరుతో లక్షల్లో మోసం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని కట్టేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ​

వివరాల్లోకి వెళ్తే బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామానికి చెందిన ఒక బాధితుడి వద్ద సారపాక ఐటీసీ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తామని అదే కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు నమ్మించి రూ. 5 లక్షలు వసూలు చేశారు.

నిందితుల్లో ఒకరు బూర్గంపాడుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు కాగా, మరొకరు భద్రాచలానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ కూడా ఐటీసీలోనే ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించకపోగా, గత కొన్ని సంవత్సరాలుగా బాధితుడికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు.​ తమ డబ్బుల కోసం వేచి చూసి విసిగిపోయిన బాధితుడు, శుక్రవారం నిందితులను యుక్తితో గ్రామానికి రప్పించారు.

వారు గ్రామానికి చేరుకోగానే గ్రామస్థుల సహకారంతో వారిని పట్టుకుని,ఊరి మధ్యలో స్తంభానికి కట్టేసి నిలదీశారు. తమకు రావాల్సిన నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

​మధ్యవర్తుల రాయబారాలు…! ​ఈ ఘటన విషయం తెలుసుకున్న మరికొందరు ఐటీసీ ఉద్యోగులు గ్రామానికి చేరుకుని నిందితుల తరపున మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

“మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం, వారిని వదిలేయండి” అంటూ బాధితులతో బేరసారాలు మొదలుపెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ​పాత నేరాల చరిత్ర ఉన్న ​నిందితులకు ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వీరు గతంలో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా నగదు వసూలు చేసినట్లు వీరిపై కేసులు కూడా నమోదై ఉన్నాయని, ఆ కేసులు విచారణలో ఉండగానే మళ్లీ ఐటీసీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇలాంటి వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ సొమ్ము తమకు తిరిగి ఇప్పించాలని నకిరేపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button