Bhadradri KottagudemTelangana
Trending

నాలుగోసారి వాత తప్పదు!

నాలుగోసారి వాత తప్పదు!

నాలుగోసారి వాత తప్పదు!

ఒళ్లంతా విషం నింపుకొని బీఆర్‌ఎస్ నేతలు కారుకూతలు కూస్తున్నారు

అప్పటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు : మంత్రి పొంగులేటి

అశ్వారావుపేటలో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభలో బీ ఆర్ ఎస్ పార్టీ పై ధ్వజం

అశ్వారావుపేట : అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కర్రుకాల్చి వాత పెట్టినా.. గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదు. ఒళ్లంతా విషం నింపుకొని రోడ్ల మీద కారుకూతలు కూస్తున్న ఆనాటి ‘ప్రభువుల’కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాలుగోసారి వాత తప్పదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మద్దతుదారులైన 60 మంది సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పదేళ్ల పాలనలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేని అప్పటి పాలకులు, ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో సోల్లు వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో నియోజకవర్గానికి కనీసం 10 ఇళ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మూడుసార్లు చెంప చెళ్లుమనిపించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అశ్వారావుపేట గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో తమ ప్రభుత్వం ఇక్కడకు 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, ఇది గిరిజన ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మేడారం జాతరను 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని రీతిలో అద్భుతమైన రాతి కట్టడాలతో పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, గ్రామాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సర్పంచులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button