
ప్రమాణస్వీకారం చేసిన తెల్లారే క్షీణించిన ఆరోగ్యం.. చికిత్స పొందుతూ బోటితండా సర్పంచ్ కన్నుమూత
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తులసీరామ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే తులసీరామ్ పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అక్కడి వైద్యుల సలహాతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌లోని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తులసీరామ్ కన్నుమూశారు. తులసీరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సర్పంచ్ తులసీరామ్ మృతితో బోటితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తులసీరామ్ మృతి పట్ల మండలంలోని ఇతర సర్పంచ్‌లు, వివిధ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.




