
ఆర్మీ వాహనం ఢీకొని పదేళ్ల బాలుడు మృతి.. తల్లికి తీవ్రగాయాలు
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. కొడుకును స్కూలులో దింపి రావడానికి స్కూటీపై బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదానికి గురైంది.
వేగంగా వచ్చిన ఆర్మీ వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్దింది. ఈ ఘటనలో స్కూలుకు వెళ్తున్న ఓ విద్యార్థి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
స్కూలుకు వెళ్తుండగా..
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ విద్యార్థి తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు వెళ్తుండగా.. ఆర్మీ వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో బాలుడు వాహనం కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఘటనా స్థలిలో ఉద్రిక్తత..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే స్కూల్ జోన్‌లో ఆర్మీ వాహనాలు ఇంత వేగంగా వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆర్మీ అధికారులతో కలిసి పోలీసులు.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ సాగుతోంది.
స్కూల్ జోన్లలో భద్రతపై ఆందోళన..
ఈ ఘటనతో తిరుమలగిరి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆర్మీ స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో వాహనాల వేగ పరిమితిని కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదం కారణంగా తిరుమలగిరి మెయిన్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు.
స్కూల్ జోన్లలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నెమ్మదిగా వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రాణనష్టాలను నివారించవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేశారు.




