
ప్రాణం మీదకు వచ్చిన ప్రేమ వ్యవహారం..
కూతురితో ప్రియుడికి ఫోన్ చేయించి.. నర్సాపూర్ బస్టాండ్‌కు పిలిపించి…
Social media viral : ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రేమించాడనే కారణంతో ఆ యువకుడిపై యువతి బంధువులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన సంఘటన నర్సాపూర్ అడవి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది.
ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మ తాండకు చెందిన దేవాసోత్ దేవి సింగ్ (24) గత రెండు సంవత్సరాల నుండి సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన వాడిత్య సంధ్య (20)ను ప్రేమిస్తున్నాడు.
ఈ విషయం సంధ్య తల్లిదండ్రులకు తెలియడంతో దేవి సింగ్‌ను నర్సాపూర్ బస్టాండ్‌కు రావాలని తన కూతురు సంధ్యతో ఫోన్ చేయించారు.
సంధ్య ఫోన్ చేయడంతో దేవి సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నర్సాపూర్ బస్టాండ్‌కు వచ్చి సంధ్యతో మాట్లాడుతున్నాడు.
ఈ క్రమంలో సంధ్యకు అన్నవరసలైన వెంకటేష్, కార్తీక్, నరేష్, తరుణ్ లు ఆ ఇద్దరినీ ఎర్టిగా కారులో ఎక్కించుకొని దేవి సింగ్‌ను కొడుతూ నర్సాపూర్ నుండి తూప్రాన్ వెళ్లే మార్గంలో గల చాకరిమెట్ల సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు.
సంధ్యను కారులోనే ఉంచి.. సంధ్యను కారులోనే ఉంచి దేవి సింగ్‌ను మాత్రమే అడవిలోకి తీసుకెళ్లడం జరిగింది.
దేవి సింగ్‌ను అడవిలోకి తీసుకెళ్లిన అనంతరం పచ్చి కట్టెలతో, రాళ్లతో బట్టలు ఊడదీసి అతడిని విచక్షణ రహితంగా చావబాదారు. దేవి సింగ్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన దేవీ సింగ్ లేచి రోడ్డుపైకి వచ్చి ఆటోలో హైదరాబాదులోని మల్లారెడ్డి దవాఖానాలో అడ్మిట్ అయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలియజేశాడు.
సంధ్యని ప్రేమించాడన్న పగతోనే తన కుమారుడిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దేవి సింగ్ తండ్రి విటల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు.



