
కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ…!
తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు ఇవాళ గురువారం బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు.
రేపు శుక్రవారం 11గంటలకు విచారణకు రావాలని సూచిస్తూ ఇవాళ జుబ్లీహిల్స్ నందీనగర్ లోని కేటీఆర్ నివాసంలో స్వయంగా నోటీసులు అందజేశారు.
దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు కేటీఆర్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్ధి అభ్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించినట్టు సిట్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ప్రశ్నించేందుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు సిట్ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.
ఇందులో హరీష్ రావుకు తన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందో సిట్ అధికారులు వివరాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. బావ అని కూడా చూడకుండా తన భర్త ఫోన్ ను కూడా కేటీఆర్ ట్యాప్ చేయించారంటూ కవిత ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కవితతో పాటు ఇతర బాధితుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కేటీఆర్ సహా ఇతర నేతలు ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారో తెలుసుకునేందుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే జరిగిన విచారణలో సిట్.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.



