Bhadradri KottagudemPoliticalTelangana

భద్రతా ఏర్పాట్లు లేని ట్రాన్స్ఫార్మర్…

భద్రతా ఏర్పాట్లు లేని ట్రాన్స్ఫార్మర్…

భద్రతా ఏర్పాట్లు లేని ట్రాన్స్ఫార్మర్…

అనూహ్య ఘటన జరిగితే ఎవరి బాధ్యత?

విద్యార్థుల ప్రాణాలకు ముప్పు – పట్టించుకోని అధికారులు

ఏన్కూర్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ప్రమాదకర స్థితిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 23 2026:ఏన్కూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వందలాది మంది విద్యార్థులు నివసిస్తూ విద్యనభ్యసిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాఠశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌కు చుట్టూ రక్షణ గోడలు లేకపోవడం, హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏ క్షణమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్‌లు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు.

గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తరచూ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో తిరుగుతున్నారని, ఆటల సమయంలో అనుకోకుండా అక్కడికి వెళ్లే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం గురించి పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల భద్రతపై పూర్తిస్థాయిలో బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ,విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తక్షణమే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ గోడలు నిర్మించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యుత్ భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఏదైనా అనూహ్య ఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత అధికారులదేనని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button