
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య…
ఆంధ్రప్రదేశ్ : పుంగనూరు కొత్తఇండ్లు ఎల్ఐసీ కాలనీలో గురువారం ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీనికి సంబంధించి పుంగనూరు సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు వివరాలు..బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ విధుల నిర్వహణకు వచ్చే సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల కోసం ఎల్ఐసీ కాలనీలో ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరుకు చెందిన కె.రంగారెడ్డి కుమారుడు కె.చెన్నారెడ్డి (30) 10 రోజుల క్రితం డ్యూటీకి వచ్చారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విధులు ముగించుకుని రూమ్‌కు వెళ్లిన తర్వాత ఫ్యాన్‌కు బెడ్‌షీట్ కట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో రాత్రి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల విచారించారు.
చెన్నారెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా మృతుడి తండ్రి రంగారెడ్డి, తల్లి, సోదరుడు సైతం వేర్వేరు సమయాల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీఐ చెప్పారు. మృతుడి భార్య 8 నెలల గర్భవతిగా ఉందని, అతని మృతికి కారణాలు తెలియడంలేదని అన్నారు.
విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు వారి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. సరైన కారణాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ తెలిపారు.



