
వృథా అవుతున్న తాగునీరు… చర్యలు ఎక్కడ?
అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లపైకి తాగునీరు
గార్లఓడ్డు గ్రామం పంచాయతీలో కొనసాగుతున్న వాటర్ లీకేజ్
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 24 2026:మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామపంచాయతీలో తాగునీటి పైప్‌లైన్ నుంచి జరుగుతున్న వాటర్ లీకేజ్ సమస్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పైప్‌లైన్ లీకేజ్ కారణంగా తాగునీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోతుండటంతో గ్రామ వీధులు చెరువులను తలపిస్తున్నాయి.
విలువైన తాగునీరు ఇలా వృథాగా వృథా అవుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గ్రామంలో పలు రోజులుగా ఈ లీకేజ్ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, మరోవైపు రోడ్లపైకి వృథాగా పారుతున్న తాగునీరు చూస్తూ ఆవేదన చెందుతున్నారు.
వాటర్ లీకేజ్ వల్ల రోడ్లు దెబ్బతింటుండటంతో పాటు, బురదగా మారి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనాలు జారిపడే ప్రమాదం ఉండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే మహిళలు ఈ నీళ్ల మధ్యగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
లీకేజ్ కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పైప్‌లైన్ మరమ్మతులు ఆలస్యం కావడం వల్ల రోజుకు వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాటర్ లీకేజ్‌ను సరిచేయాలని, పాడైన పైప్‌లైన్‌ను మార్చి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



