KhammamPoliticalTelangana

మున్సిపల్ ఎన్నికల్లో పైరవీలకు తావులేదు.. వారసత్వానికి చోటులేదు

మున్సిపల్ ఎన్నికల్లో పైరవీలకు తావులేదు.. వారసత్వానికి చోటులేదు

మున్సిపల్ ఎన్నికల్లో పైరవీలకు తావులేదు.. వారసత్వానికి చోటులేదు

జనం మెచ్చిన వారికే టికెట్లు…!

ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది

శివరాత్రి లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి!

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి

ఖమ్మం : “మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది.. మనమంతా సిద్ధం కావాలి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం. పైరవీలకు ఇక్కడ తావులేదు. జనం కోరుకునే వ్యక్తికే బి-ఫామ్ అందుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల నుంచి తరలివచ్చిన పార్టీ ఇంచార్జీలు, ముఖ్య నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

సర్వేల ఆధారంగానే ఎంపిక
టికెట్ల కేటాయింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “వారసత్వ రాజకీయాలకు నా వద్ద చోటు లేదు. నా రక్తసంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వను. ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం. ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో, ఎవరికైతే గెలిచే సత్తా ఉందో వారికే అవకాశం దక్కుతుంది. ఓటర్ల మనసు గెలుచుకున్న వారే అభ్యర్థులుగా బరిలోకి దిగుతారు” అని పేర్కొన్నారు.

రెచ్చగొడితే మోసపోవద్దు
పార్టీలో టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దని మంత్రి సూచించారు. “అధికారంలో ఉన్నాం కాబట్టి అందరికీ ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తాం. కొందరిని కో-ఆప్షన్ సభ్యులుగా, మరికొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవిస్తాం. పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని ఎవరైనా రెచ్చగొడితే మోసపోవద్దు. అటువంటి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది” అని హెచ్చరించారు.

మోడల్ మున్సిపాలిటీగా చేయడమే లక్ష్యం
ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 15న శివరాత్రి లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కార్యకర్తలే నా బలం
“మీరు నా కళ్ళు, చెవుల వంటి వారు. మీ కష్టమే నాకు గౌరవం. నేను ఎప్పుడూ కార్యకర్తలను విస్మరించను. ప్రజలతో నిరంతరం మమేకమై ఉండే వారికే నా మద్దతు ఉంటుంది” అని మంత్రి పొంగులేటి ఉద్ఘాటించారు. అనంతరం ఒక్కో వార్డు నాయకులతో ఆయన ముఖాముఖి చర్చించి, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button