
కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలకు కేంద్ర విద్యా శాఖ ఆమోదం.. త్వరలోనే నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 2026-27 విద్యా సంవత్సరానికి అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS Jobs) ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది అని KVS వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
మొత్తం 987 పోస్టులలో 493 స్పెషల్ ఎడ్యుకేటర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు ఉండగా, 494 స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో అవసరాన్ని బట్టి ఈ పోస్టులను కేటాయించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడించనున్నారు.
స్పెషల్ ఎడ్యుకేటర్ TGT పోస్టులకు అర్హతలు : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా జనరల్‌లో బీ.ఎడ్ డిగ్రీ, ప్రత్యేక విద్యలో డిప్లొమా తప్పనిసరి.
అలాగే సీటెట్ పేపర్-2 అర్హత, భారత పునరావాస మండలి (RCI)లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
ఈ పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు.
స్పెషల్ ఎడ్యుకేటర్ PRT పోస్టులకు అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ (12వ తరగతి) ఉత్తీర్ణత ఉండాలి.
ప్రత్యేక విద్యలో డిప్లొమా, సీటెట్ పేపర్-1 అర్హత తప్పనిసరి. అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకునేలా అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. అభ్యర్థులు కేవలం KVS అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.



