
వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి : ప్రెస్ క్లబ్ ఏన్కూర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏన్కూర్ జర్నలిస్టుల విజ్ఞప్తి
సవరణ జీవో–103 జారీపై కృతజ్ఞతలు తెలిపిన అధ్యక్షుడు ధీరావత్ సందీప్ నాయక్
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 28 2026:మీడియా కార్డుల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవరణ జీవో నెం.103ను జారీ చేయడంపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రెస్ క్లబ్ ఏన్కూర్ అధ్యక్షుడు ధీరావత్ సందీప్ నాయక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం ఏన్కూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న అక్రెడిటేషన్ సమస్యలకు ఈ జీవో ఒక పరిష్కారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లభించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం జీవోలో మార్పులు చేయడం జర్నలిస్టులందరికీ ఊరటనిస్తుందని అన్నారు.
జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఆయా ఎడిషన్ సెంటర్లలోనే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఇందువల్ల పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లోనూ వర్కింగ్ జర్నలిస్టులకు తగిన స్థానం కల్పించాలని మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల అభిప్రాయాలు నేరుగా కమిటీల్లో ప్రతిబింబించేలా ఈ విధానం ఉండాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యంగా కొనసాగుతూ, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ఏన్కూర్ ఉపాధ్యక్షులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి గోపికృష్ణతో పాటు అశోక్ రెడ్డి, రమేష్, ఠాగూర్, రాము, నరసింహ, చంద్రశేఖర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది.



