
మేడారం జాతరలో విషాదం.. జంపన్న వాగులో పడి భక్తుడు మృతి
జంపన్న వాగులో పడి భక్తుడు మృతి చెందిన ఘటన మేడారం జాతరలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బీమారానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ (54) కుటుంబంతో సహా బుధవారం మేడారానికి చేరుకున్నారు.
జంపన్న వాగులో స్నానం అనంతరం తల్లుల ఆశీర్వాదం తీసుకుందామని ఆశించిన శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు. వరదలో కొట్టుకుపోవడంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు.
జాతర మొదటి రోజే దుర్ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా… జంపన్న వాగులో వరద ప్రవాహం పెరగడం, అడుగు భాగాన గల ఇసుక లోతులు అక్కడక్కడా హెచ్చు తగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదివరకు వాగులో ఉన్న లోతు హెచ్చు తగ్గులు సరి చేయలేదని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తలనీలాలు తీసుకొని భక్తిశ్రద్ధలతో వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు గద్దెల వద్దకు తరలివెళ్తున్నారు.
సారలమ్మ కన్నెపల్లి నుండి ఈరోజు గద్దెలకు చేరుకుంటున్న తరుణంలో భక్తులు అత్యధికంగా మొక్కులు చెల్లిస్తున్నారు. తల్లులను వేడుకుంటున్నారు. భక్తులతో గద్దెల ప్రాంగణం రద్దీగా మారింది. గద్దెల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.



