
ఆటో ను ఢీ కొట్టిన ట్రాక్టర్… భార్య, భర్తలు దుర్మరణం…
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణంచెందారు.
వీరి కుమారుడు, కూతురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనతో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పూసల మంజుల ఆమె భర్త బాలరాజు బజ్జీ మిర్చీలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరు పాతూరు లో జరిగే వారాంతపు సంతకు వెళ్లేందుకు కుమారుడు అభిలాష్, కూతురు అక్షరాలతో పాటు మరో మహిళ ను తమ ప్యాసింజర్ ఆటోలో ఎక్కించుకొని గ్రామం నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను అక్కన్నపేట సమీపంలో ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో భార్య మంజుల అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్త బాలరాజు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
గాయపడిన కుమారుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ షిఫ్ట్ చేయగా, కూతురు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భార్యాభర్తల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.



