
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఆపి సోదాలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అందరికీ ఒకటేనని నిరూపిస్తూ పోలీసులు తమ విధిని నిర్వహించారు.
పోలీసులు తన వాహనాన్ని ఆపిన వెంటనే కేటీఆర్ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా సానుకూలంగా స్పందించారు. స్వయంగా కారు దిగి, పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించారు.
అధికారులు వాహనం లోపల క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నంత సేపు ఆయన చిరునవ్వుతో పక్కనే నిలబడ్డారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పోలీసులు ఆయనకు ధన్యవాదాలు తెలపగా, అక్కడి నుంచి ఆయన ముందుకు సాగారు.
ఎన్నికల సమయంలో సామాన్యులైనా, వీఐపీలైనా చట్టానికి లోబడి ఉండాలని కేటీఆర్ వ్యవహరించిన తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
అనవసర వాదనలకు పోకుండా అధికారుల పనికి ఆటంకం కలిగించకపోవడం ఒక బాధ్యతాయుతమైన నాయకుడి లక్షణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.



