
ఐటీసీ స్కూల్ ఆవరణలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన విద్యార్థుల వాహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ పాఠశాల ఆవరణలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులను తీసుకువచ్చిన ఒక టాటా ఏసీ వాహనం పాఠశాల ప్రాంగణంలోనే పూర్తిగా దహనమైంది.
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఐటీసీ యాజమాన్యం, సెక్యూరిటీ విభాగం తీరుపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పాఠశాలకు విద్యార్థులు చేరుకుంటున్న వేళ కళాభారతి భవనం సమీపంలో విద్యార్థులను దింపిన కొద్దిసేపటికే టాటా ఏసీ వాహనం నుండి పొగలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు పెద్దవిగా మారి వాహనాన్ని చుట్టుముట్టాయి.

ప్రమాద సమయంలో వాహనంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడం పెను ప్రమాదాన్ని తప్పించింది. ఒకవేళ పిల్లలు లోపల ఉన్న సమయంలో ఈ మంటలు వ్యాపించి ఉంటే పరిస్థితి ఏమిటన్నది తలచుకుంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
ఐటీసీ భద్రతపై ప్రశ్నల వర్షం.. అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని, రక్షణలో తమకు సాటిలేరని గొప్పలు చెప్పుకునే ఐటీసీ యాజమాన్యం తీరు ఈ ప్రమాదంతో బట్టబయలైంది. ఈ ప్రమాదంపై ప్రజల నుండి కొన్ని కీలక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అనుమతి లేని వాహనం లోపలికి ఎలా వచ్చింది?. కళాభారతి ఆవరణలోకి ప్రైవేట్ ఆటోలు, టాటా ఏసీ వాహనాలకు అనుమతి లేదని అధికారులు చెబుతుంటారు. మరి నిబంధనలకు విరుద్ధంగా ఆ వాహనం లోపలికి ఎలా ప్రవేశించింది? సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఏం చేస్తున్నారు?
వాహనం నుండి చిన్నగా పొగ వస్తున్నప్పుడే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు అప్రమత్తం కాలేదు? మంటలు భారీగా ఎగిసి పడి వాహనం మొత్తం దహనమయ్యే వరకు చూస్తూ ఊరుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన కళాభారతి భవనంలో కనీస స్థాయిలో అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా లేవా?
ఒకవేళ ఉంటే, ఆపద సమయంలో అవి ఎందుకు పని చేయలేదు? ప్రమాదం జరిగిన తీరును విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, జరిగిన విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు సెక్యూరిటీ విభాగం ఎందుకు తాపత్రయపడింది? అని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.
భద్రతా వారోత్సవాలు.. అంతా ప్రహసనమేనా?.. ఇటీవలే ఐటీసీ ఆధ్వర్యంలో ‘భద్రతా వారోత్సవాలు’ నిర్వహించి, భద్రతా చర్యలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం డ్రైవర్ల నిర్లక్ష్యం, సెక్యూరిటీ వైఫల్యం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం విచారకరం.
కేవలం రక్షణ చర్యల గురించి గొప్పలు చెప్పడమే తప్ప, ఆచరణలో అవి శూన్యమని ఈ సంఘటన తేటతెల్లము చేస్తోంది. బాధ్యత ఎవరిది?.. టాటా ఏసీ వాహనం కాలి బూడిద అవ్వడానికి అటు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇటు సెక్యూరిటీ వైఫల్యమే ప్రధాన కారణాలని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఐటీసీ యాజమాన్యం స్పందించి, ఈ అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలను బయటపెట్టాలని, విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



