నిషా నిడలో షాద్ నగర్ నియోజక వర్గం
బెల్ట్ షాపులు నిర్మూలన ఏక్కడ.?
విచ్చల విడిగా పరిమితికి మించి బెల్ట్ షాపులు
పైగ సమయ పాలన పాటించని నిర్వాహకులు
వేకువ జామున 4 నుండి మద్యం విక్రయాలు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మాటలకే పరిమితమ..?
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని మద్యం నిర్మూలనకు అడ్డుకట్ట వేయాలని ప్రజల విజ్ఞప్తి
ఫిబ్రవరి: 9 శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ( సి కె న్యూస్ ప్రతినిధి )
బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి విధితమే.కానీ ఆ హమి వాగ్దానాలకే పరిమితమైందని ఆచరణలోకి సాధ్యం కాలేదని బహుజన సమాజ్ పార్టీ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు తుప్పరి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యాన్ని వైన్స్ ల ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నియంత్రణలో నడుస్తాయి.
అయితె షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చల విడిగా అనధికారిక మద్యం కేంద్రాలుగా గ్రామాల్లో వెలిశాయి. వీటితో పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. ఇప్పుడు మందు దొరకని పల్లెలు అంటూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన బెల్టు షాపులు ప్రజల్ని మద్యానికి బానిసను చేస్తున్నాయి.
చిన్న చిన్న గ్రామాలలో పరిమితికి మించి ఒక్కొక్క గ్రామంలో 17 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఇందులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గ్రామాల్లో సమయ పాలన పాటించకుండా వేకువ జామున 4 గంటల నుండీ 11.12 గంటల వరకు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి.
దీంతోగ్రామాల్లో ఎంతో మంది తాగుడుకు బానిసై జీవితాలు చిన్నబిన్నం చేసుకున్న సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మత్తుకు బానిసై ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.ముఖ్యం గా యువతపై ఇవి తీవ్ర ప్రభావం చూపాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. కల్తీ మద్యం దందా కూడా జోరుగా సాగుతోంది. మారో వైపు యువత తాగుడుకు బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు బెల్ట్ షాపు నిర్వాహకులు అధికార పార్టీ అండదండలతో మమ్మల్ని ఎవ్వడ్రా ఆపేది అంటూ విర్రవీగుతూన్నారు.
ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి డబ్బే ముఖ్యం అంటున్నారు.మహిళలు ప్రజాసంఘాలు మద్యం బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన బెల్ట్ దుకాణాల నియంత్రకు చెక్ పెడుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైన షాద్ నగర్ నియజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి బెల్ట్ షాపులకు అడ్డు కట్ట వేయాలని ప్రజలు తమ వేదనను వెళ్లగాక్కుతున్నరు.