దుమ్ముగూడెం పోడు భూముల సర్వేలో గందరగోళం
కోర్టుకు వెళ్లిన వారి భూములు సర్వే చేయడం కోసం వెళ్ళిన ఫారెస్ట్ అధికారులు
సర్వే నిర్వహించకుండా అడ్డు పడుతున్న కొంతమంది వ్యక్తులు
గతంలోనే హై కోర్టును ఆశ్రయించి ఊరట పొందిన 34 మంది రైతులు
మీ భూముల కోసం దోషులుగా నిలబెట్టారంటూ రైతులపై పంచాయతీ కార్యదర్శి ఆగ్రహం
(సి కె న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 20:
తాము సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన 34 మంది దుమ్ముగూడెం మండలం జెడ్. వీరభద్రాపురానికి చెందిన పోడు రైతులకు గతంలోనే కోర్టు నుండి ఊరట లభించింది.
అయితే వారి భూములు సర్వే చేయడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులకు సరైన సహకారం లభించలేదు. కొంతమంది వ్యక్తులు సర్వే నిర్వహించే క్రమంలో అడ్డు పడుతున్నారు. వారికి పంచాయతీ కార్యదర్శి వత్తాసు పలుకుతూ కోర్టుకు వెళ్లిన రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హై కోర్టు ముందు తనను దోషిగా నిలబెట్టారంటూ కోర్టును ఆశ్రయించిన 34 మంది పొడు రైతులను ఉద్దేశించి పౌరుషంగా వ్యాఖ్యానిస్తుండడం వీడియోలో రికార్డు అయింది. అసలు ఆయన ఎందుకు పోడు రైతులతో అలా పౌరుషంగా మాట్లాడుతుంది అర్థం కాక రైతులు అయోమయంలో పడ్డారు. మరో వైపు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు సర్వే నిర్వహించడానికి అడ్డు పడుతున్నారు.
పాతికేళ్లుగా పొడు భూముల్లో సాగు చేసుకుంటున్నా ఇంకా పట్టాలు మంజూరు కాక పంచాయతీ కార్యదర్శులు రశీదులు ఇచ్చినా పట్టాలు రాకపోవడం భద్రాచలం ఐ.టి.డి.ఏ లో నాలుగేళ్ల క్రితం పెట్టిన విన్నపాలు కనీసం పట్టించుకోక పోవడంతో రైతులు నేరుగా హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి హై కోర్టులో మొర పెట్టుకుని చివరికి కోర్టు నుండి అనుకూలంగా నిర్ణయం వచ్చినా ఇలా సర్వే పనులు నిలిచి పోయేసరికి 34 మంది రైతులు నిరాశకు లోనయ్యారు.
రైతులపై శివాలెత్తిన పంచాయతీ కార్యదర్శి
సర్వే నిర్వహించడంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఈ నెల 19 న గ్రామానికి రావాలంటూ గ్రామ అటవీ హక్కుల కమిటీ లేఖ ద్వారా కోరింది. అటవీ అధికారులు 20 న గ్రామానికి సర్వే కోసం వచ్చారు. కానీ కోర్టును ఆశ్రయించిన రైతులకు సమాచారం లేకుండా పంచాయతీ కార్యదర్శి వేరే వ్యక్తులను వెంట బెట్టుకుని పొడు భూముల్లోకి వెళ్ళాడు.
సమాచారం తెలుసుకున్న పోడు రైతుకు సర్వే ప్రదేశానికి వెళ్ళినప్పుడు పంచాయతీ కార్యదర్శి కోర్టుకు వెళ్ళిన రైతులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారని కోర్టు ముందు తనను దోషిగా నిలబెట్టారని అర్థం లేకుండా మాట్లాడుతున్నారని రైతులు వాపోయారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఊరంతా సర్వే చేయాలని కలెక్టర్ మేడం చెప్పిందంటూ పోడు సర్వేకు సంబంధం లేకుండా ఏదేదో చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
34 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు కాబట్టి ముందుగా కోర్టు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి భూములు సర్వే చేసిన తర్వాత మిగతా వారి భూముల సర్వే ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారని కానీ పంచాయతీ కార్యదర్శి మాత్రం మౌలిక సదుపాయాలు,
గ్రామ అభివృద్ధి అంటూ కోర్టు ఆదేశాలతో సంబంధం లేని వారిని సర్వే ప్రదేశానికి తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడమే కాకుండా రైతులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం బాధాకరమని రైతులు బాధపడుతున్నారు. కాగా అటవీ అధికారులు మళ్ళీ రేపు సర్వే నిర్వహించడానికి వస్తామని 34 మంది పోడు రైతులకు సర్దిచెప్పి వెళ్లినట్లు రైతులు తెలిపారు.