కదులుతున్న మరో డొంక…
గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది.
అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టు ఏసీబీ (ACB) అధికారులు గుర్తించారు. ఇప్పటికే నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు.
ఆ నలుగురు అధికారులను ఏసీబీ మూడు రోజుల పాటు విచారించిన క్రమంలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డ్‌ల్లోకి బీనామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించారు. మొయినుద్దీన్ నుంచి లక్షల రూపాయలు ఫేవర్‌గా జాయింట్ డైరెక్టర్ తీసుకున్నారు.
రైతుల డబ్బులు కొట్టేసి మోయినుద్ధిన్, అతడి కుమారుడు ఇక్రం విదేశాలకు పారిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు జాయింట్ డైరెక్టర్‌కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.
కాగా గొర్రెల పంపిణీ పథకం బిల్లు చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితులైన సయ్యద్ మొహిదొద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ అహ్మద్.. విదేశాలకు పరారయ్యారు. విదేశాల్లో నక్కి.. బాధిత రైతులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ తండ్రీకొడుకులపై లుకౌట్ నోటీసు జారీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
రైతుల వద్ద నుంచి గొర్రెలను కొనుగోలు చేసి.. అందుకు సంబంధించిన రూ. 2.10 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయకుండా దారి మళ్లించిన కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరికొందరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రూ.2.10 కోట్ల బిల్లు చెల్లింపు వరకే ఇది పరిమితం కాలేదని, మరికొంత మంది రైతుల నుంచి పెద్దమొత్తంలో నిధులు దారి మళ్లించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.
విదేశాల్లో నక్కిన తండ్రీకొడుకుల్ని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు ఏసీబీ వద్దకు చేరుకునేటప్పటికే ప్రధాన నిందితులిద్దరూ విదేశాలకు పరారయ్యారు.