సింగరేణి కాలుష్యంతో అంతుచిక్కని విష జ్వరాలు
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
మండల పరిధిలోని కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజలు అంతు చిక్కని విష జ్వరాలతో విలవిలాడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఈ జ్వరం బారిన పడ్డారు. కాలనీలో ఒక్కరోజు వ్యవధి లోనే 20 మంది ఈ జ్వరం బారిన పడటం గమనార్హం. తీవ్రమైన ఒళ్ళు,కీళ్ల నొప్పులు, జ్వరం, వాంతులు తో కూడిన లక్షణాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.మా కాలనీకి అతి సమీపాన నిర్మించిన సైలోబంకర్ నుండి వెలువడే బొగ్గు మసి వల్లనే మాకు ఇలాంటి రోగాలు సంక్రమిస్తున్నాయని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా సింగరేణి అధికారులు స్పందించి మా ప్రాణాలను కాపాడాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఈ జ్వరాలపై ప్రభుత్వ వైద్యాధికారిని వివరణ కోరగా కిష్టారం లోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు మాత్రమే పై లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారని రక్త పరీక్షలు నిర్వహించిన టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలుగా నిర్ధారణ కావడం లేదని ఇతర పరీక్షల కోసం రక్త నమూనాలను ఖమ్మం పంపినట్లు వివరించారు.
ఎమ్మెల్యే చొరవతో హెల్త్ క్యాంప్
మండల పరిధిలోని కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీవాసులు అంతుచిక్కని విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలుసుకొని తక్షణమే కాలనీవాసులకు వైద్య సహకారాలు అందాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి గంగారం
పి.హెచ్.సి వైద్య అధికారి అవినాష్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం అంబేద్కర్ నగర్ కాలనీలో హెల్త్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారిని అంబులెన్స్ ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.