లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అధికారి!
ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారులపై ప్రత్యేక ద్రుష్టి సారించింది. అనేక చోట్ల తమ విధులను నిర్వహించేందుకు సామాన్యుల దగ్గర లంచం తీసుకుంటున్నారు అనే సమాచారం అందడం తో ప్రత్యేకమైన నిఘా ని ఏర్పాటు చేసిన ఏసీబీ, ఈమధ్యనే ఒక అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటనని అంత తేలికగా మనం మర్చిపోలేం.
మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ నిజాంపేట నగర పాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారి అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు.
ఏసీబీ డీఏస్పీ మాజీద్ ఆలీఖాన్ వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌లో గొట్టిపాటి శ్రీనివాసులునాయుడుకు ఉన్న వాణిజ్య భవనంలో ‘చెన్నపట్నం చీరలు’ షోరూం ఏర్పాటైంది.
పక్కన కంటెయినర్‌లో టీస్టాల్ కొనసాగుతోంది. నిజాంపేట నగర పాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ప్లానర్(ఏసీపీ) మాతంగి శ్రీనివాసరావు పలుమార్లు సిబ్బందితో కలిసి వచ్చాడు.
దుకాణం ఎదుట హోర్డింగులను తొలగించాడు. కంటెయినర్‌లో టీస్టాల్‌ను కూడా తొలగిస్తానని భవన యజమానిని బెదిరించాడు. అవి కొనసాగాలంటే రూ.1.50 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడు అనిశాను ఆశ్రయించాడు.
సోమవారం సాయంత్రం డబ్బు ఇవ్వడానికి భవన యజమాని ఏసీపీని ఫోన్‌లో సంప్రదించాడు. అధికారి భారాస నేత రాములునాయక్‌ను పంపాడు. అతడు డబ్బులు తీసుకున్నాక.. వాటిని ఏసీపీ శ్రీనివాసరావు తీసుకోగానే అనిశా అధికారులు పట్టుకున్నారు.
కూకట్‌పల్లిలోని అతడి ఇంటిపాటు కరీంనగర్‌లోని సొంతింట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ తెలిపారు. నిందితులను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. దాడిలో సీఐలు ఆకుల శ్రీనివాస్, మల్లికార్జున్, పురేందర్ పాల్గొన్నారు.