కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు
ఇవాళ్టితో ముగియనున్న కస్టడీ
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవిత, సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ్టితో కవిత కస్టడీ సమయం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ హైదరాబాద్ లో సోదాలు చేపట్టింది. కవిత బంధువుల ఇళ్లల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
శనివారం ఉదయం 06 గంటల తర్వాత ఏడు మందితో కూడి ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోదాలు చేపట్టింది. ఇక్కడ ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే కవిత కస్టడీలో ఉండగానే… బంధువుల ఇళ్లల్లో సోదాలు జరపటం చర్చనీయాంశంగా మారింది. కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయా…? లేక మరేదైనా కోణంలో తనిఖీలు చేపట్టారా అన్నది తేలాల్సి ఉంది.
ఇవాళ్టితో ముగియనున్న కస్టడీ… మరోవైపు ఈ కేసులో కవిత కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం తర్వాత ఈడీ అధికారులు… కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కస్టడీలో కవిత పేర్కొన్న విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది ఈడీ.
అయితే కవిత కస్డడీని మరింత పొడగించాలని ఈడీ కోరుతుందా లేక జ్యూడిషయన్ కస్టడీకి ఇవ్వాలని కోరుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితను… గత ఆరు రోజులుగా ఈడీ ప్రశ్నిస్తోంది.
సుప్రీంలో దక్కని ఊరట…
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా… దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది.
ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు.
అయితే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఇవాళ్టితో కవిత కస్టడీ ముగియనుంది.