ఎవడ్రా నిన్ను పిలిచింది…
ఎమ్మెల్సీ V/S మాజీ ఎమ్మెల్యే
తాజాగా తెలంగాణ భవన్ వేదికగా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. స్టేజీపై సీనియర్ నేతలు అందరూ చూస్తుండగానే తిట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డి
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అని మాగంటి గోపి మండిపడ్డారు. నిన్ను ఎవడు పిలిచిండ్రా.. నువ్వేవడివి.. నాకు చెప్పేదంటూ రావుల కౌంటర్ ఇచ్చారు.
వెంటనే ఇరువురు నేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజీ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. కాగా, గతం నుంచే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధర్ రెడ్డి నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ టికెట్ మాగంటికి అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలోనే గతంలో ఇద్దరి నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కూడా గతంలో నడిచింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంపై చేపట్టిన సమీక్షలో కూడా నేతల మధ్య రసభస జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.