కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది.
తల్లిదండ్రులు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలను భావిస్తారు.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవడంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తాయి. అందుకే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతుంటారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడంటే?!
ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్చాలంటే వారి వయసు కనీసం 6 సంవత్సరాలు ఉండాలి.
అంత కంటే తక్కువ వయసు ఉంటే విద్యార్థుల అడ్మిషన్ ఫారమ్స్‌ను తిరస్కరిస్తారు. 2024 మార్చి 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి పేరెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న ప్రకటిస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నట్టు కేవీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
దీంతోపాటు రెండు, ఆ పైతరగతుల్లో (ఇంటర్ మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి.
రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న, మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా ప్రకటించారు. ఎంపికైన వారి జాబితాను 20 రోజుల్లోపు వెల్లడిస్తారు. మరిన్ని వివరాల కోసం కేంద్రీయ విద్యాలయం అధికారిక వెబ్‌సైట్https://kvsangathan.nic.in/ను సందర్శించండి.
నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ)కు చెందిన పిల్లల అడ్మిషన్ ఫారమ్‌లను కేంద్రీయ విద్యాలయాలు అంగీకరించవు.