లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య!
తండ్రి సెల్‌కు మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
తమ కాలేజీ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని ఆ విద్యార్థిని తన కుటుంబీకులకు వాట్సాప్ మెసేజ్ పంపింది. తన ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడడంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించినట్టు అందులో పేర్కొంది. ఈ ఆత్మహత్య ఘటన విశాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
విద్యార్థిని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి ఏడాది డిప్లొమో చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్‌ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా గురువారం రాత్రి తన తండ్రికి, అక్కకు మెసేజ్ పంపింది.
‘నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో సెక్స్‌వల్ హెరాస్మెంట్ జరుగుతోంది నాన్నా. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ, ఆ ఫ్యాక్టల్టీయే అందులో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం. చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌కి ఫ్యాకల్టీ చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీయే ఆ స్టూడెండ్స్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇంక ఎవరికి చెప్పాలి. నా ఫొటోస్ కూడా తీసుకుని బెదిరిస్తున్నారు.
నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేక, అలా అని కాలేజ్‌కి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఏం చేసినా మా ఫొటోస్ వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు వేరే దారి కనిపించడం లేదు. ఎవరో ఒకరు చస్తేనే ఈ విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది.
ఆ పని నేనే చేస్తున్నాను. నీకు మంచి కూతురుని కాలేకపోయినందుకు ఐయామ్ రియల్లీ సారీ నాన్నా’ అని ఆ మేసేజ్‌లో ఉంది. దీన్నిబట్టి లైంగిక వేధింపుల కారణంగానే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఆ మెసెజ్‌ను చూసిన వెంటనే విద్యార్థిని కుటుంబసభ్యులు అత్యవసర నెంబర్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు కాలేజీ హాస్టల్‌కు వచ్చారు.
అప్పటికే ఆవరణలో పడి ఉన్న విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా, ఫలితం లేకపోయింది. సదరు విద్యార్థిని హాస్టల్ నాల్గో అంతస్తు మేడపై నుంచి దూకిందా? లేక విషం ఏదైనా తీసుకుందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడపైనుంచి దూకితే కింద రక్తం ఉంటుందని, అలాంటిదేమీ అక్కడ లేదని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.
ప్రస్తుతం విద్యార్థిని మృతదేహం విశాఖ కెజిహెచ్లో ఉంది. విద్యార్థి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పిఎం పాలెం పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు వెల్లడి కానున్నాయని చెప్పారు.
గురువారం రాత్రి విద్యార్థిని తన తండ్రి, అక్కకు పంపిన మెసేజే ఆధారమా? ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. రెండు రోజులుగా ఆ విద్యార్థిని ముభావంగా ఉంటోందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆమె కాలేజీకి వెళ్లలేదని, స్టడీ అవర్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. ఉదయం వాష్ రూమ్‌లోకి వెళ్లిన తరువాత నుంచీ ఆమె కనిపించలేదు.
దీంతో, తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం గురువారం రాత్రి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి 12.50 గంటల తర్వాత అమ్మాయి వాష్ రూమ్ నుంచి బయటకొచ్చి నాలుగు అంతస్తుల భవనంపైకి వెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయిందని అక్కడి వారు, అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, కింద చూస్తే అమ్మాయి పడి ఉందని హాస్టల్ వాచ్‌మ్యాన్ చెబుతున్నారు.
కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు, ఐద్వా ఆందోళన
విద్యార్థిని మృతిపై సగ్రమ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఐద్వా ఆధ్వర్యాన కళాశాల వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జె.నాయుడు, ఐద్వా మధురవాడ జోన్ నాయకులు భారతి, సిఐటియు నాయకులు రాజ్‌కుమార్ మాట్లాడారు. విద్యార్థిని తన తండ్రికి పంపిన వాట్సాస్ మెసేజ్‌ను మీడియాకు చూపించారు.