మంత్రి తుమ్మలపై దాడి పన్నాగాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి ప్రదాత, ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్దదిక్కు, రైతుల పక్షపాతి, రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడైన తుమ్మలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘గుర్తు తేలని వ్యక్తులు’ ఖమ్మం జిల్లా కేంద్రంలో దాడికి పన్నాగాలు చేయడాన్ని ఆళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకులు పాయం రామనర్సయ్య, మొహమ్మద్ అతహార్ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొందరు తమ అరాచకాన్ని ప్రదర్శించి భయోత్పాతాన్ని సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూశారని కానీ అది వారికి కలగానే మిగిలిందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి ప్రదాత తుమ్మలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్యంగా ఏజెన్సీ మండలాల ప్రజలకు ఎలా కాపాడుకోవాలో తెలుసన్నారు. గత 1984 సంవత్సరం నుండి తుమ్మల ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి యెనలేని కృషి చేస్తుంటే ఆనాటి నక్సలైట్ పార్టీలు, కమ్యూనిస్టులే తుమ్మలకు బ్రహ్మరథం పట్టారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కొందరు ఆకతాయిలు చేసే తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి తుమ్మలపై మీరు ఎన్నిసార్లు రెక్కీ చేసిన ఆయనకు ప్రజాభిమానం వెన్నంటే ఉంటుందని తెలిపారు. మా సహనానికీ ఓ హద్దు ఉంటుందని, దాడికి కుట్ర పన్నిన వారికి తుమ్మల ఓసారి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజా సేవకే తన రాజకీయ జీవితాన్ని అంకితం చేస్తున్న మంత్రిని దాడులతో నిలువరించాలని చూడటం దారుణమన్నారు.
మీ కుట్రలు, కుతంత్రాలు మాని అభివృద్ధికి తోడ్పడాలని, తుమ్మలతో కలిసి రావాలని హితవు పలికారు. దాడి కుట్రలు రుజువైతే దోషులు ఎంతటి వారైనా పోలీసులు కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో దోషులు ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర వెంకన్న, సిరినోముల శ్రీనివాసరావు, తాళ్లపల్లి వెంకన్న, బూరుగడ్డ నాగేష్, తులం ముత్తిలింగం, కరకపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.