భద్రాద్రి రాముడి సాక్షిగా రుణమాఫీపై రైతులకు రేవంత్ గుడ్ న్యూస్..
మహబూబాబాద్ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆగష్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని పేర్కొన్నారు.
మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని.. పదేళ్లలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందన్నారు. మోడీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. మోడీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తండ్రి రెడ్యానాయక్‌ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలన్నారు.
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పక్కకు పెట్టారని.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… మోడీ లాథూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధే మంజూరు చేశారన్నారు.
ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ తెలంగాణను అవమాన పరిచారన్నారు. అప్పుడు పార్లమెంట్‌లో తానే ప్రత్యక్ష సాక్షిననని పేర్కొన్నారు. ఉత్తర భారత దేశంలోని కుంభమేళాకు వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం… మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇచ్చారన్నారు.
మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ కిషన్ రెడ్డి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి పదవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. వందరోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ద్రోహులకు ఒక్క ఓటు వేయొద్దు.. ఒక్క సీటు ఇవ్వొద్దు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ. సోనియమ్మ బిడ్డను ప్రధాని చేసే బాధ్యత మనపై ఉంది.
జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ నుంచి 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం. రైతులకు రెండింతలు ఆదాయం తెస్తానన్న మోదీ రైతులను కాల్చి చంపారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తానన్న మోదీ తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు..
దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం అంటూ చాంతాడంత హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు.. మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. అప్పుడే రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చలేదు దిగిపొమ్మంటున్నారు..
దిగిపోవడానికి ఇక్కడున్నది అల్లాటప్పా వ్యక్తి కాదు.. రేవంత్ రెడ్డి… కేసీఆర్.. నన్ను దింపడం నువ్వు కాదు కదా..నీ అయ్యతరం కాదు.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం… ప్రజా పాలన అందించి తీరుతాం.. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి పేదవాడి బిడ్డల కళ్లలో ఆనందం చూసాం.
ఆగస్టు 15లోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. భద్రాద్రి రాముడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా… పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది.. వచ్చే పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి తీరుతాం.. బలరాం నాయక్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించండి..” అని సీఎం పేర్కొన్నారు.