ఏలూరు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై ఎసిబి దాడిలో ఒక సిఐ..
ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసు కుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఏలూరు త్రీటౌన్ సీఐ వెంకటేశ్వర రావు ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ ఆ సొమ్ము తీసుకున్నారని అధికారులు జరిపిన దర్యాప్తులో రుజువు కావడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. నగరంలోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సుబ్బరాజు శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఏలూరు నగర శివారు సత్రం పాడుకు చెందిన విక్టర్ బాబు త్రీటౌన్ పోలీసుస్టే షన్లో ఓ చీటింగ్ కేసులో నిందితుడు. అతను తను అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించి 41 సీఆర్పీసీ నోటీసు జారీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
దాన్ని అమలు చేసెందుకు త్రీటౌన్ సీఐ వెంకటేశ్వరరావు రూ.50 వేల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని విక్టర్ బాబు పోలీసులకు ముఖం చాటేసి తిరుగుతు న్నారు. సీఐ వెంకటేశ్వరరావు స్టేషన్ అసిస్టెంట్ రైటర్ రాజేంద్రను విక్టర్ బాబు ఇంటికి పలు మార్లు పంపించారు.
డబ్బు ఇవ్వకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయపడిన విక్టర్ బాబు సీఐ వెంకటేశ్వరరావును కలవగా ఈసారి రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే కేసు సెక్షన్లు మార్చి అరెస్టు చేస్తామని బెదిరించారు.
పోలీసుల వేధింపులు భరించలేక విక్టర్ బాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అందులో భాగంగా విక్టర్ బాబు తొలుత రూ.50 వేలు ఇస్తానని సీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న విధంగా ఈ నెల 25న రాత్రి రూ.50 వేలు తీసుకుని త్రీటౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. అక్కడ సీఐని ఫోన్లో సంప్రదించారు.
త్రీటౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ ఇస్సాక ను రూ.50 వేలు తీసుకోమని సీఐ పురమాయించారు. ఆయన విక్టర్ బాబు వద్ద రూ.50 వేలు తీసుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఇస్సాకున్ను పట్టుకుని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరిపామని ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. సీఐ ప్రమేయం ఉందని తేటతెల్లం కావడంతో ఆయనను ప్రధాన నిందితుడిగా, అసిస్టెంట్ రైటర్ రాజేంద్రను రెండో నిందితుడిగా, డబ్బు తీసుకుని పట్టుబడిన ఇస్సాక్ ను మూడో నిందితుడిగా చేర్చామన్నారు. ముగ్గురిని అరెస్టు చేశామని, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు.