ఇద్దరి టార్గెట్ డబుల్ డిజిట్.. పైచేయి ఎవరిది..?
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి.
ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వాళ్లు డబుల్ డిజిట్ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం అభ్యర్థులు ఒక లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.
ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. బీఆర్‌ఎస్ నాయకులు సైతం ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలకు ముందే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఐదుగురు వేరే పార్టీల్లో చేరిపోయారు. దీంతో ప్రధానపోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 14 సీట్లలో గెలవాలని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ను ఐదు నుంచి ఆరు స్థానాలకే పరిమితం చేయడం ద్వారా డబుల్ డిజిట్ సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడున్న నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో విజయం సాధించేందుకు కమలనాధులు వ్యూహాలు రచిస్తున్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్ మనుగడ సాగాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని కేసీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరిట తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆ నాలుగుచోట్ల..
మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో నాలుగు స్థానాలను తప్పకుండా గెలుచుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఆ నాలుగు చోట్ల మెజార్టీపైనే హస్తం నేతలు దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ బలంగా ఉండగా.. ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో తమ గెలుపు నల్లేరుపై నడకని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ బలంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం తక్కువుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ నాలుగుకు తోడు..
తెలంగాణలోని సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఈ నాలుగు స్థానాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాలను ఈజీగా గెలుచుకునే అవకాశం ఉందని కమలం పార్టీ అంచనా వేస్తోంది.
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ.. గెలపు అవకాశాలు తమకే ఉన్నట్లు కమలనాధులు చెబుతున్నారు. ఇక మరో మూడు మూడు స్థానాల్లో గట్టిపోటీ ఉందని, పోల్ మేనేజ్‌మెంట్ ఆధారంగా ఆ మూడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది.
భువనగిరి, మెదక్, నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తున్నప్పటికీ.. గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. భువనగిరిలో మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మెదక్‌పైనే ఆశలు..
తెలంగాణలో 12 స్థానాల్లో గెలుస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల వైపు ఓటర్లు మొగ్గుచూపడం లేదని అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఒక మెదక్ స్థానంలోనే బీఆర్‌ఎస్‌కు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోకపోయినా.. ఆ పార్టీకి వచ్చే ఓట్లపైనే ఇతర పార్టీ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 17 స్థానాలకు గానూ డబుల్ డిజిట్ దాటేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. డబుల్ డిజట్ ఏ పార్టీకి వస్తాయనేది జూన్4న తేలనుంది..