పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇటుక బట్టీలు…అనుమతులు లేకుండా నిర్వహణ
బాల కార్మికుల నిర్మూలనపై కన్నేయండి సర్
కార్మిక చట్టాలకు తూట్లు… కూలీలతో వెట్టి చాకిరి
బాల కార్మికులతో వెట్టి చాకిరి చేస్తున్న ఇటుక మాఫియా నిర్వాహకులు
వెంకన్న గూడెం తండా సమీపంలో పత్లవత్ పిర్యా నాయక్ ఇటుక బట్టి నిర్వాహకుడి తీరు
షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిస్తున్నాయి. అయితే బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలు అష్ట కష్టాలు పడుతున్నారు.
వెట్టి చాకిరి చేయించుకునే ఇటుక బట్టి నిర్వాహకులు నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీస వేతనం లేకుండానే కూలీల జీవితాలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో గడిచిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కావడంతో ఎవ్వరికీ చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఫరూఖ్ నగర్ మండలం వెంకన్న గూడెం సమీపంలో ఇటుక బట్టి నిర్వాహకుడు ” పాత్లవత్ పిర్య నాయక్ ” ఏళ్ళ తరబడి చైల్డ్ లేబర్ విధులు నిర్వహిస్తున్నారు.పంట పొలాలలో ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికంగా ఉండే వనరులన్ని కొల్లగొడుతున్నారు. అక్రమ వ్యాపారాలు స్థానికంగా బహిరంగంగా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే వారు మాత్రం ఉచిత విద్యుత్‌ను తమ వ్యాపారాలకు వాడుకుంటున్నారు. పట్టా భూములల్లో ఉన్న బోరులను సైతం వ్యాపారానికి అనుగుణంగా వాడుకుంటున్నారు. పరిసర ప్రాంతాలలోని కుంటల్లో, చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి ఇటుకల తయారీకి ఉపయోగిస్తున్నారు.
చదువుకోవాల్సిన బాల్యంలో వెట్టిచాకిరి చేయిస్తున్న ఇటుక బట్టి నిర్వాహకులు
కార్మిక చట్టాలు కూడా వర్తింపచేయకుండా వారితో పని చేయించుకుంటున్నారు. బాల కార్మికులతో పనులు చేయించడం చట్టరీత్య నేరం అయినా అవి పట్టింపు లేకుండా యదేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కోట్లు కొల్లగొడుతూ ఇటుక బట్టి వ్యాపారాలు కోట్లు గడిస్తున్నారు.
కేవలం తిండి పెడితే చాలు ఇక్కడే పడి ఉంటారన్న రీతిలో వారి చేత ఇటుక బట్టి యజమానులు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.దానికి తోడు ఇతర రాష్ట్రాలు వలస రావడంతో ఎవరికి చెప్పు లేక గత్యంతరం లేక వారి వేదనలు భరిస్తున్నారు. మరోవైపు ఇటుక బట్టికి మట్టి కావాలంటే రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి వుంటుంది.
కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ చెరువుల్లో ఉన్న మెత్తటి మట్టిని దర్జాగా సేకరించి పెద్ద పెద్ద గుట్టలుగా మట్టిని నిలువ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అక్రమ ఇటుక బట్టీలను నివారించే నాధుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు.
సంబంధిత రెవెన్యూ అధికారులు,చైల్డ్ లేబర్ అధికారులు స్పందించి బాల కార్మికుల చేర నుంచి విముక్తి కల్పించాలని, ఇలాంటివి పునర్వృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరారు.