మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశం
తీసుకునే నిర్ణయాలు ఇవే
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం షరతులతో కూడిన అనుమతినివ్వగా.. సోమవారం మంత్రిమండలి సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి భేటీకి హాజరుకావాలని మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని సీఎస్ కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించేందుకు శనివారం మంత్రిమండలి భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కోడ్ అమలులో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది. రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. తాజాగా షరతులతో కూడిన అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్కు ఆదివారం లేఖ రాశారు. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.