నడిరోడ్డుపై బీర్ తాగుతూ రచ్చ చేసిన యువతీ, యువకుడు అరెస్ట్ !
నాగోలులో శుక్రవారం ఉదయం ఓ యువతి, యువకుడు మద్యం మత్తులో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. స్థానిక ఫతుల్లాగూడ ఏరియాలో ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు.బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్ వాక్‌కు వచ్చిన వారు వారించారు.
పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వాళ్లిద్దరూ.. వాకర్స్‌తో ఘర్షనకు దిగారు. నోటికొచ్చింది మాట్లాడుతూ హడావిడి చేశారు. కారును వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేశారు. వారి బాగోతాన్ని రికార్డు చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. ఫోన్లు లాక్కుంటూ దుర్భాషలాడారు.
స్థానికుల సమాచారంతో… పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
దీంతో రంగంలోకి దిగిన నాగోలు పోలీసులు.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. యువకుడు అలెక్స్‌తో పాటు యువతిపై పబ్లిక్ న్యూసెన్స్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా వీరిద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని తెలిసింది.
నిన్న గాక మొన్న పుణెలో డ్రంక్ డ్రైవ్ ఎంతటి ముప్పు తెచ్చిందో చూశాం. క్షణాల వ్యవధిలో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో కూడా గతంలో డ్రంక్ డ్రైవ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. వీరు తాగి కారు నడుపుతూ అక్కడికి వచ్చారు. రోడ్డుపై ఆపి మళ్లీ తాగడం మొదలెట్టారు. వద్దని వారించిన వారిని.. దుర్భాషలాడారు. ఏదైనా ఈ తరహా ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.