పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
Web desc : అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది.
నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు.
గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జి షీట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు.
దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు.
జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు.
వెసులుబాటును అస్త్రంగా మలచుకుని..
నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.