రాష్ట్రంలో మళ్లీ కరోనా షురూ.. ఒక్క రోజే నాలుగు కేసులు నమోదు..!
తెలంగాణరాష్ట్రంలో కరోనా ఎంట్రీ అయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 402 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురిలో వైరస్ నిర్ధారణ అయింది.
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఏడు నెలల తర్వాత ప్రత్యేక హెల్త్ గ్లాన్స్ రిపోర్టును రిలీజ్ చేసింది. పేషెంట్లతో పాటు క్లోజ్ కాంటాక్ట్స్ మరో ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు బులెటెన్‌లో పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇళ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని కోరారు. మార్కెట్లు, జన సామూహిక ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని కోరారు. ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించాలన్నారు.
జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ ఫెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని కోరారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెల్త్ బులెటెన్ లో మార్గదర్శకాలు పొందుపరిచారు.
ఇక పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా వైద్యాధికారులతో అత్యవసర సమీక్షను నిర్వహించారు. సచివాలయంలో సుమారు మూడు గంటల పాటు కొత్త కోవిడ్ పై రివ్యూ జరిగింది.
కొత్త వేరియంట్ జేఎన్.1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కొత్తవైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధం గా ఉంచాలని సూచించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు సూచించారు.
ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ బేరియంట్‌లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై డీహెచ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాతావారణ మార్పులతో ప్లూ లక్షణాలతో కూడిన బాధితులు పెరిగే ఛాన్స్ ఉన్నదన్నారు.