ఇందిరమ్మ ఇళ్ల విషయంలో బిగ్ ట్విస్ట్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. మొదటగా కొన్నింటిని అమలు చేసిన వెంటనే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
దాంతో.. కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి. ఇటీవలే ఎన్నికల కోడ్‌ను ఎలక్షన్ కమిషన్ ఎత్తివేయడంతో మిగతా పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇక ముఖ్యమంగా రైతు రూ.2లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ వరకు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందు కోసం అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు.
కాగా.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. కానీ.. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుందని సమాచారం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
అది కూడా మహిళల పేరుమీదే ఇవ్వాలని ఆలోచిస్తుందట. తొలి దశలో సొంత స్థలం ఉంది.. ఇల్లు లేని వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తెలిసింది.
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పరిశీలించే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రజాపాలన దరఖాస్తులో ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కోసం ఎంతో మంది అర్జీ పెట్టుకున్నారు. మరి చివరకు ట్విస్ట్ ఇచ్చి రేవంత్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకే ఇస్తుందా అనేది చూడాలి.