చెంచు మహిళపై పాశవిక దాడి.!
సీకే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:
నాగర్ కర్నూలు జిల్లా మొల్ల చింతపల్లిలో దారుణం
మర్మాంగాలపై పచ్చి కారం, డీజిల్ చల్లి నిప్పంటించిన నిందితులు
ఫిల్టర్ ఇసుక తయారీ కోసం కుటుంబంతో వెట్టిచాకిరి
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా ఓ చెంచు కుటుంబంపై ముగ్గురు వ్యక్తులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. పది రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మంగాలపై పచ్చి కారం, డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం మొలచింతలపల్లి గ్రామంలో వెలుగు చూసింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు ఈదన్న ఈశ్వరమ్మ(30)లు భార్య భర్తలు కాగా అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ వద్ద ఇసుక ఫిల్టర్ తయారీలో పనిచేస్తున్నారు.
వీరితోపాటు ఈశ్వరమ్మ అక్క బావలు కూడా వారి వద్దే దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.
ఏళ్ల కాలంగా తమ వద్ద ఇసుక ఫిల్టర్ తయారీ కోసం వెట్టి చాకిరి చేయించుకొని తిండికి, ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో తన ముగ్గురు పిల్లల్ని పోషించుకోలేక ఇతర పని చేసుకోవాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది.
దీంతో కోపంతో రగిలిపోయిన ఇసుక వ్యాపారి బండి వెంకటేష్ తన భార్య బండి శివమ్మ, తమ్ముడు బండి శివుడు ముగ్గురు కలిసి ఈశ్వరమ్మపై పైశాచిక దాడికి తెగబడ్డారు.
పది రోజులుగా ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అందుకు ఈశ్వరమ్మ అక్క బావలను కూడా బెదిరించి వారి సాయాన్ని కూడా తీసుకున్నారు. చేతులు కాళ్లు కట్టేసి పచ్చి మిరపకాయలను దంచి ఆ రసాన్ని మర్మాంగాలపై రుద్దారు.
అక్కడికీ కోపం చల్లారక దగ్గర్లోనే ఉన్న డీజిల్ పోసి మర్మంగాలపై నిప్పంటించారు. దీంతో తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం రాత్రి నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.